Online Puja Services

నాయనార్ల గాథలు - సుందరమూర్తి నాయనారు

3.137.180.32

నాయనార్ల గాథలు - సుందరమూర్తి నాయనారు.
లక్ష్మీ రమణ 

పరమాత్మని చేరుకోవడానికి సంగీతమూ, సాహిత్యమూ రాజమార్గాన్ని నిర్మి స్తాయా లేక ఈ రెండింటి కలయిక కోసం భగవంతుడే పరితపించి తాన అనునూయులని అవతారంగా ఈ భువికి పంపుతాడా ? అనే సందేహాలు కొందరు మహానుభావుల జీవన విశేషాలని చదువుతున్నప్పుడు తప్పకుండా కలుగుతాయి. అన్నమాచార్యులు ఆ వేంకటేశ్వరుని మీద అంతటి కమనీయమైన పదాలు అల్లి , ఆలపించి అనంతమైన ఆ స్వామి కృపకి పాత్రమవ్వడానికి ఆయన స్వామివారి ఖడ్గమైన నందకం యొక్క అవతారం కావడమే కారణమని చెప్పేవారున్నారు. ఆ విధంగా ఈ భువిపై అవతరించిన భక్త వాగ్గేయకారుల చరితలు ఎన్నో ఉన్నాయి. అదే కోవలో ఈ భువిపై అవతరించిన సుందర సాహిత్య , సంగీతజ్ఞుడు సుందరమూర్తి నాయనారు. 

కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఆశీనులై ఉన్నారు. పార్వతీదేవి పరిచారికలు అందమైన పూలమాలలల్లి అమ్మకి అలంకారం చేస్తున్నారు. శివపూజకు పూలు సేకరించి తీసుకువచ్చే అలల సుందరారు అక్కడికి వచ్చాడు. మనోహరులైన అమ్మవారి చెలికత్తెలని చూసి ఒక్క క్షణం అతని మనసు మోహపరవసాన్ని పొందింది . ఈశ్వరుడు ఆ విషయాన్ని పసిగట్టి, అలలసుందరారుని భూలోకంలో ఆ చెలికత్తె లిద్దరితో  సహా  జన్మించమని, వారిని వివాహమాడి కర్మఫలాన్ని అనుభవించమని శాశించాడు. 

దేవదానవులు క్షీరసాగర మధనం చేసినప్పుడు ఉదవించిన హాలాహలాన్ని తన  చేతులతో పోగుచేసి అందించిన వాడు అలల సుందరారు . అటువంటి వానికి కూడా కర్మని అనుభవించక తప్పలేదు.  శివాజ్ఞని శిరసా వహించవలసిందే! కానీ ఆ శివుని పాదపద్మాల చుట్టూ తిరిగే భ్రమరం సుందరారు. పరమ పావనమైన ఆ పాదములని విడిచి తాను బ్రతకలేనని, సంసార సాగరంలో పడి ఆ స్వామిని మరువకుండా ఉండేలా వరాన్ని అనుగ్రహించమని వేడుకున్నాడు.  సరేనన్నాడు భోళాశంకరుడు. 

ఆ విధంగా శివాజ్ఞని అనుసరించి కర్మభూమిలో జన్మనెత్తాడు సుందరారు.  అది 8దవ శతాబ్దం. తమిళనాడు ప్రాంతం . అక్కడ తిరునవల్లూరు  అనే గ్రామంలో మహాశివభక్తులైన శడయనాయనారు , ఇసై జ్ఞానమ్మ నాయనార్లకు దైవదత్తంగా జన్మించాడు అలలసుందరార్ . ఆ పిల్లాడికి తన తండ్రి పేరైన నంబి ఆరూరు అని నామకరణం చేశారు శడయనాయనారు . 

శివుడు సుందరేశ్వరుడు కదా ! ఆయన అనుగ్రహించిన బిడ్డ కాబట్టి ఆరూరు కూడా అద్భుతమైన సౌందర్య దీప్తితో ప్రకాశిస్తూ బాలశివుడా అన్నట్టుండేవాడు. ఆ దేశ రాజైన నరసింగ మునయ్యారు ఒకసారి ఆ పిల్లవాడిని చూసి ఎంతో ముచ్చట పడ్డాడు. ఆ బంగారు తండ్రిని తన ఇంట పెంచుకోవాలనుకున్నాడు. పిల్లాడి తల్లితండ్రుల అనుమతిని అర్థించాడు. ముందే చెప్పుకున్నట్టు, ఆరూరు  తల్లిదండ్రులు ఇద్దరు కూడా నాయనాలలో చేరినటువంటి మహాశివ భక్తులు.  భవ భంధాలకు అతీతులు.  కాబట్టి వెంటనే రాజు గారి కోరికను మన్నించి పిల్లవాడిని రాజు గారి పోషణకు అప్పచెప్పారు.  రాజుగారు అతని బ్రాహ్మణ ధర్మాన్ని నిలుపుతూ, వేద వేదాంగాలన్నీ అభ్యసింప చేశాడు. 

ఆరూరుకి  యుక్త వయస్సు వచ్చిందని తల్లిదండ్రులు పిల్లవాడికి వివాహం చేయాలని నిశ్చయించారు.  కానీ, కారణజన్ముడైన  ఆరూర్ వివాహ నిర్ణయం ఆ ఈశ్వర సంకల్పంగా జరగాలని రాసి ఉంది. తాళికట్టే సమయానికి ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి పెళ్లి జతాగడానికి వీల్లేదని ఆపేశాడు.  ఒళ్లంతా విభూతితో, మెడ చుట్టూ రుద్రాక్షలతో,శిరస్సున శిఖతో ప్రత్యక్షమై పెళ్లిని అడ్డుకున్న ఆ వృద్ధుడు  “అరూర్ నా బానిస.  నా బానిసైనట్లు రాతపూర్వకమైన సాక్ష్యం కూడా నా దగ్గర ఉంది. ఈ ప్రతిని సుందరారు తాతగారే నాకు రాసిచ్చారు అందుచేత ఆరూర్ వివాహం చేసుకోవడానికి వీల్లేదు” అన్నాడు.  దాంతో ఆ వివాహం కాస్త ఆగిపోయింది.  ఆ వృద్ధుడు అంతటితో ఆగలేదు.  ఆరూర్ ని  తన బానిసగా వెంటతీసుకొని ఊరు వదిలి దేశాలు పట్టి వెంట తిప్పసాగాడు. 

ఆరూర్ కి నిశ్చయంచేసి, తాళి కట్టేదాకా తీసుకొచ్చిన కన్యామణి మనసంతా ఆరూర్ నే  నింపుకొని ఆయన పైన దిగులతో  కైలాసాన్ని చేరుకుంది.  ఇక, ఆమె అలా కావడానికి , తానిలా ఊర్లు పట్టుకొని తిరగానికీ కారణమైన ఆ వృద్ధ బ్రాహ్మణుడికితో ఆరూర్ తగాదా పెట్టుకున్నాడు. “ అసలు నేను నీకు బానిసనే  కాదు పొమ్మన్నాడు.  నీ అబద్ధాల చిట్టాలిక చెల్లవు . పద , తిరునవల్లూరుకు పోదాం . నన్ను బానిసగా నీకు పెద్దల ముందే ఈ వివాదాన్ని తేల్చుకుందామని, తన సొంత ఊరికి ఆ బ్రాహ్మణుణ్ణి కూడా తీసుకొని వచ్చాడు .  

పెద్దల సముఖంలో వీరి వాజ్యం ఆరంభమయ్యింది . ఆ బ్రాహ్మణుడు   తన దగ్గర ఉన్న రాత ప్రతిని అక్కడున్న పెద్దలకు చూపించాడు.  “తిరునవల్లూరు వాస్తవ్యుడనైన నంబి  ఆరూర్ అనే నేను తిరునవల్లూరు పితకు మా వంశపారంపర్యంగా దాస్యం చేయడానికి త్రికరణ శుద్ధిగా అంగీకరించి ఈ పత్రాన్ని రాసి ఇస్తున్నానని” అతని తాతగారు రాసిచ్చినటువంటి వ్రాతప్రతి అది. అక్కడ ఆరూర్ తాత గారి సంతకాన్ని పోల్చి చూసినటువంటి సభలోని పెద్దలందరూ కూడా ఆపత్రాన్ని ధ్రువీకరించారు. ఇక ఆరూర్ తన జీవితం ఈ పిత సేవకే  అంకితం అని నిశ్చయించేసుకున్నాడు. ఇంతకీ  తమిళంలో పిత అంటే- పిచ్చివాడని అర్థం .

పితగా చెప్పుకున్న ఆ  వృద్ధ బ్రాహ్మణుడు ఆరూర్ ని , అతని పెద్దలనీ “రండి మా ఇంటికి తీసుకుపోతా”నని వెంటతీసుకువెళ్ళి  అక్కడి ఈశ్వర  దేవాలయంలో ప్రవేశించి అంతర్ధానమయ్యాడు. అప్పుడు అర్థమయ్యింది ఆరూర్ కి వచ్చినవారెవరో! ఒక్కసారిగా గొంతు పూడుకుపోయింది . గుండె  బరువై , ఆ కరుణా సముద్రుని దయకి , కారుణ్యానికి కన్నుల నుండీ నీరై ప్రవహించింది. అప్పుడు ఒక దివ్య వాణి వినిపించింది.   “సుందరార్ ! నువ్వు నా మిత్రుడివి. నాతొ కైలాసంలో ఉండేవాడివి. సంసార బంధాలలో చిక్కుకోకుండా రక్షించేందుకే  నేనిలా వచ్చాను. నన్ను పిచ్చివాడిని (పితన్) అన్నావు. పరుషమైన మాటలతో నిందించావు . కనుక నిన్ను వతోండన్ (పరుషంగా మాట్లాడేవాడిని ) అని పిలుస్తాను.  నువ్వు పితన్ అనే పదం తోటి మొదలయ్యే పదాలతోనే పాటలల్లి నన్ను కీర్తించాలి” అని ఆదేశించారు.  ఆవిధంగా తన పూర్వ నామధేయమైన సుందరార్ నామంతో అనేకానేక కీర్తనలు మనోహరంగా రచించి గానం చేశారు సుందరమూర్తి నాయనారు. వీటిని తేవారాలు అంటారు . 

ఆ తర్వాత శివాదేశానుసారమే లోకమంతా సంచరిస్తూ, ఆయా ప్రదేశాలలో శివయ్యని కొలుచుకోవడం ,  ఆయన మీద తేవారాలు పాడడం ఇదే సుందరారు పనయ్యింది.   శివుడు సఖుడై , సుదరారు మిత్రుడై అతని కోసం తానె నడిచి వచ్చిన  సందర్భాలు ఆయన జీవితంలో కొల్లలుగా ఉన్నాయి.  తనకేం కావాలన్నా ఒక మిత్రుణ్ణి అడిగినంత స్వతంత్రంగా ఆ స్వామిని అడిగేవాడు .  ఈశ్వరుడు మిత్ర ధర్మాన్ని సుందరారు పట్ల నూరుశాతం పాటించేవాడు.  ఈ అనుబంధంతోనే తానె స్వయంగా దూతగా మారి, ఆనాడు కైలాసంలో సుందరారు కోరుకున్న సుందరాంగులని కూడా భార్యలని చేశాడు.  కోరినప్పుడెల్లా ధనాన్ని అనుగ్రహించాడు.  కరువు కాటకాలు ఏర్పడ్డప్పుడు సుందరారు పాడిన పాటలకి వశుడై, కరువన్నదే కానరాకుండా ధాన్యపు రాశులని ఆయనఉన్న ప్రాంతంలోని ప్రజలందరికీ అనుగ్రహించాడు. ఒక్క పడిగం పాడితే చనిపోయిన వారిని సుందరారు కోసం తిరిగి బ్రతికించాడు.   సమయాచారులని లోకం ఆయన్ని పొగిడేలా చేశాడు. ఈశ్వరుడే తోడున్నవాడికి తిరుగేమిటి ? అనుకోని ధర్మ విరుద్ధంగా ప్రవర్తించినందుకు, ఒక మంచి మిత్రుడై తిరిగి ధర్మమార్గంలో నడిచేలా చేశాడు.  

ఈ విధంగా భగవంతునితో సఖ్యము ఒక ఎత్తయితే , చేరమాను పెరుమాళ్ అనే భగవంతుని భక్తునితో సఖ్యము మరొక ఎత్తు. మొసలి మింగిన బాలుణ్ణి , తన భక్తితో తిరిగి బ్రతికించిన సుందమూర్తి నాయనారు అంటే అతనికి ఎనలేని భక్తి , గౌరవము. తాను ఒక రాజునని కూడా మరచి సుందరారు సాన్నిహిత్యంతో పరవశించేవాడు చేరమాను. 

ఒకనాటి సాయంసమయంలో ఒకటరిగా శివాలయానికి వెళ్లి ఈశ్వరార్చనలో తన్మయుడైపోయాడు సుందరారు.  అప్పుడు ఈశ్వరుడు ఆయన్ని కైలాసానికి ఆహ్వానించదలిచారు. ప్రమథగణాలని పిలిచి ఐరావతం (తెల్ల ఏనుగు) మీద సుందరార్ ని కైలాసానికి తీసుకురావాల్సిందిగా ఆజ్ఞాపించారు. ఆయనకి ఈశ్వరుడు స్వయంగా ఈ విషయాన్ని తెలియజేశారు. సుందరార్ తనతో పాటు తన మిత్రుడైన చేరమానుని తీసుకువెళ్లాలని అనుకున్నాడు. ఆయన అనుకున్నదే తడవుగా ఆ విషయం చేరమానుకి స్ఫురించింది.  వెంటనే వాయువేగంతో ప్రయాణించే ఈశ్వర ప్రసాదితమైన తన భద్రాశ్వము సాయంతో సుందరారున్న గుడికి చేరాడు .  అప్పటికే ఐరావటాన్ని అధిరోహించిన సుందరారుని అనుగమించేందుకు వీలుగా ఆ భద్రాశ్వానికి చెవిలో పంచాక్షరిని ఉపదేశించాడు.  వెంటనే ఆ భద్రాశ్వము చేరమాన్ పెరుమాళ్ళుని ఐరావతం చెంతకి చేర్చింది .  సుందరారు , చేరమాను తమ భూతిక శరీరాల్ని భువిపైనే వదిలి దివ్య శరీరాలతో కైలాసాన్ని చేరారు . 

కైలాసంలో చేరమాన్ కి ఆహ్వానం లేనందున అనుమతి లేదని ద్వారం వద్దనే ఆపేశాయి ప్రమథగణాలు.  సుందరారు తిరిగి ఈశ్వరుని ప్రార్ధించాడు.  తన మిత్రునికి కూడా కైలాసాన్ని అనుగ్రహించమని వేడుకున్నాడు. ఈశ్వరుడు ఆయన విన్నపాలు స్వీకరించి స్వయంగా నందీశ్వరుణ్నే చేరమానుని ఆహ్వానించడానికి పంపించాడు .  ఆవిధంగా సుందరమూర్తి నాయనారు తన మిత్రునికి కూడా శాశ్వత కైలాసాన్ని అనుగ్రహించారు.      

ఆవిధంగా 18 ఏళ్ళ కాలం మాత్రమే సుందరమూర్తి నాయనారు ఈ భువిపైన జీవించిన కాలం . ఈ కొద్ది సమయంలోనే ఆయన ఎందరో అనునూయుల్ని తయారు చేసుకున్నారు.  సమయాచారులనే అనంత కీర్తిని సొంతం చేసుకున్నారు.  ఇప్పటికీ తిరుజ్ఞాన సంబందార్ , అప్పారు నాయనార్లతో పాటు దివ్యమైన ఈ సుందరమూర్తి నాయనారు చరితాని కథలు కధలుగా తమిళనాట కీర్తిస్తూంటారు.  పిచ్చివాడని ఆ యోగీశ్వరేశ్వరుడైన శివుడి కొలిస్తే , మిత్ర స్థానమిచ్చి ఆదరించే అనంత కరుణాసముద్రుడు ఈశ్వరుడు.  ఆ దివ్యమూర్తి పాదపద్మాలని శిరసా , మనసా, వాచా నమస్సులు అర్పిస్తూ ..  శుభం . 


సర్వం శ్రీ గురు దక్షిణామూర్తి పాదారవిందార్పణమస్తు !!

 

Nayanar, Stories, Sundaramurthy, Sundarar, 

Quote of the day

A coward is incapable of exhibiting love; it is the prerogative of the brave.…

__________Mahatma Gandhi